స్కూల్ కుర్రాళ్లకు చక్కటి చాన్స్ _ ప్రతిభ గల ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించనుంది.

13/06/2012 20:48

 

ఈ నెల 15 నుంచి జూనియర్ ఫుట్‌బాల్ క్యాంప్
ఎంపికైతే అత్యుత్తమ శిక్షణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: https://sakshi.com/newsimages/contentimages/13062012/KSR_0087000213-6-12-22100.jpgప్రతిభ గల ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించనుంది. ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు నగరంలో జూనియర్ పుట్‌బాల్ క్యాంప్ జరగనుంది. ఇందులో ప్రతిభ గల చిన్నారులను ఎంపిక చేసేందుకు సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలియాంజ్ దీనిని నిర్వహిస్తోంది. మంగళవారం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ వివరాలు వెల్లడించారు. 14-16 ఏళ్ల వయసు గల పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. సెలక్షన్స్‌లో 50 పాఠశాలల నుంచి 2500 మంది పాల్గొనే అవకాశం ఉంది. ఒక్కో పాఠశాలనుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తారు. గతంలో దేశంలోని ఏడు నగరాల్లో ఈ తరహా కార్యక్రమం నిర్వహించినా...హైదరాబాద్‌లో జరపడం ఇదే తొలిసారి. ఈ ఎంపిక ప్రక్రియలో ముందుగా 100 మందిని, ఆ తర్వాత 15 మందిని హైదరాబాద్ తరఫున సెలక్ట్ చేస్తారు. ఈ ఆటగాళ్లు దేశంలోని ఇతర నగరాల జట్ల కుర్రాళ్లతో పోటీ పడతారని బజాజ్ అలియాంజ్ ప్రతినిధి సుబ్రమణ్యం రామస్వామి అన్నారు. ‘జట్టుగా కాకుండా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి ఎంపిక ఉంటుంది. డ్రిబ్లింగ్, హెడర్, కిక్ తదితర ప్రాథమిక అంశాల్లో వారి సత్తాను పరీక్షించి ఎంపిక చేస్తాం’ అని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు ఆటగాళ్లకు మ్యూనిచ్ (జర్మనీ)లోని అలియాంజ్ సెంటర్‌లో కోచింగ్‌తో పాటు ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్ తరఫున స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. 

అందరికీ అవకాశం...

ఆటగాళ్ల సెలక్షన్స్‌ను భారత మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్‌తో పాటు ‘సాయ్’ ఫుట్‌బాల్ కోచ్ వేణుగోపాల్, ఫుట్‌బాల్ రిఫరీ విన్సెంట్ పాల్ పర్యవేక్షిస్తారు. ఎల్బీ స్టేడియం లేదా జింఖానా మైదానంలో ఈ ఎంపికను నిర్వహిస్తారు. అయితే పాఠశాలల్లో చదవని ప్రతిభ గల ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా ఈ సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. 022-4184 9916 నెంబర్‌కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కుర్రాళ్లు సెలక్షన్స్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వారు స్పష్టం చేశారు.