సత్తా చాటిన సత్తి గీత *100 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం-రజతం గెలుచుకున్న నజీబ్ జాతీయ అథ్లెటిక్స్

24/06/2012 11:41

 

 

https://sakshi.com/newsimages/contentimages/24062012/gttt24-6-12-59860.jpg


హైదరాబాద్, న్యూస్‌లైన్: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు శుభారంభం లభించింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన స్ప్రింట్ ఈవెంట్లలో సత్తి గీత, నజీబ్ ఖురేషీ సత్తా చాటారు. మహిళల 100 మీటర్ల పరుగులో గీత స్వర్ణం గెలుచుకుంది. చాలా కాలంగా అథ్లెటిక్స్‌కు దూరంగా ఉన్న గీత, మరో సారి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. 12.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి గీత మొదటి స్థానంలో నిలిచింది. ఎంఎం అంచు (కేరళ-12.18 సె.) రజతం గెల్చుకోగా, రుమా సర్కార్ (బెంగాల్-12.37 సె.)కు కాంస్యం దక్కింది. పురుషుల 100 మీటర్ల పరుగులో రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీబ్ ఖురేషీ రజత పతకం సాధించాడు. 10.59 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఖురేషీ రెండో స్థానంలో నిలిచాడు. ధరమ్‌వీర్ (హర్యానా-10.51 సె.) స్వర్ణం, కిషన్ కుమార్ (మహారాష్ట్ర-10.60 సె.) కాంస్యం అందుకున్నారు. మహిళల 400 మీటర్ల పరుగులో రాష్ట్ర అథ్లెట్ కోరాడ మృదుల ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 

లండన్‌కు సహానా కుమారి

తొలి రోజు చాంపియన్‌షిప్‌లో ఒక అథ్లెట్‌కు లండన్ ఒలింపిక్స్ బెర్తు దక్కింది. మహిళల హైజంప్‌లో కర్ణాటకకు చెందిన సహానా కుమారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1.92 మీటర్ల ఎత్తు జంప్ చేసిన సహానా ఈ అవకాశం దక్కించుకుంది. గతంలో బాబీ అలోయిసిస్ (1.91 మీ.) పేరిట ఉన్న మీట్, జాతీయ రికార్డులను కూడా ఆమె బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్‌లో మల్లికా మోండాల్ (బెంగాల్-1.79 మీ.) రజతం గెలుచుకోగా, ఎన్‌కే షాజీ (కేరళ- 1.76 మీ.) కు కాంస్య పతకం లభించింది. 

ఇతర ఫలితాలు

పురుషుల విభాగం: 5000 మీ. పరుగు: 1. ఇంద్రజిత్ పటేల్ (యూపీ-14ని: 21.44సె), 2. మన్ సింగ్ (ఢిల్లీ- 14: 21.95), 3. నితీందర్ సింగ్ (ఉత్తరాఖండ్- 14: 25.36) ట్రిపుల్ జంప్: 1. అర్పీందర్ సింగ్ (పంజాబ్- 15.90 మీ.), 2. సౌరభ్ (యూపీ- 15.79 మీ.), రాజశేఖర్ (తమిళనాడు- 15.69 మీ.) డిస్కస్ త్రో: 1. ధరమ్ రాజ్ యాదవ్ (మధ్యప్రదేశ్- 51.62 మీ.), 2. సుశీల్ త్రిపాఠి (యూపీ-50.61 మీ.), బినోయ్ (కేరళ- 49.39 మీ.) 

మహిళల విభాగం: 5000 మీ. పరుగు: 1. సహానారా ఖాతూన్ (బెంగాల్- 17ని: 58.56సె), 2. మోనికా మోతిరామ్ (మహారాష్ట్ర- 18: 02.78), 3. అర్చనా పాల్ (యూపీ- 18: 09.51) 
పోల్‌వాల్ట్: 1. సురేఖ (తమిళనాడు- 3.60 మీ.), 2. ఎస్వీ ఖ్యాతి (కర్ణాటక- 3.50 మీ.), ఆర్.రేమ్య (కేరళ- 3.40 మీ.) 

జావెలిన్ త్రో: 1. అనూ రాణి (యూపీ-53. 95 మీ.), సుమన్ దేవి (యూపీ- 53.61 మీ.), రూపీందర్ కౌర్ (పంజాబ్- 47.01 మీ.).