షరపోవా-ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఎరానితో అమీతుమీ

08/06/2012 08:46

 

రష్యా అందాల భామ షరపోవా పూర్వ వైభవాన్ని అందుకుంది.

- నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్ 
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఎరానితో అమీతుమీ

https://sakshi.com/newsimages/contentimages/08062012/SHARAPOVA8-6-12-12547.jpgరష్యా అందాల భామ మరియా షరపోవా ఎట్టకేలకు తన పూర్వ వైభవాన్ని అందుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించింది. మరోవైపు ఇటలీ సంచలనం ఎరాని తన జోరును కొనసాగిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో వీరిద్దరు తలపడతారు.

పారిస్: క్లే కోర్టులపై మంచి పట్టున్న షరపోవా కెరీర్ స్లామ్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో గురువారం జరిగిన రెండో సెమీస్‌లో రెండోసీడ్ షరపోవా 6-3, 6-3తో నాలుగోసీడ్ పెట్రా క్విటోవా (చెక్)పై విజయం సాధించింది. దీంతో 2008 తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అలాగే తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గతేడాది వింబుల్డన్ ఫైనల్లో క్విటోవా చేతిలో ఎదురైన పరాజయానికి ఈ మ్యాచ్‌లో రష్యన్ స్టార్ ప్రతీకారం తీర్చుకుంది. 2007, 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా సెమీస్‌లోనే వెనుదిరిగింది. 

ఈమె తొలిసెట్ నాలుగో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను సాధించింది. దీంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత పుంజుకున్న క్విటోవా బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగింది. కానీ రెండోసీడ్ క్రీడాకారిణి తొమ్మిదో గేమ్‌లో మూడు సెట్ పాయింట్లను గెలుచుకుని సెట్‌ను సొంతం చేసుకుంది. షరపోవా రెండోసెట్‌లో సర్వీస్‌ను కాపాడుకుని 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో డబుల్ ఫాల్ట్‌తో 1-3తో వెనుకబడ్డ క్విటోవా తర్వాత 2-3 స్కోరును సాధించింది. కానీ షరపోవా దూకుడుగా ఆడి 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సర్వీస్‌లో రెండో ఏస్‌ను సంధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

https://sakshi.com/newsimages/contentimages/08062012/ERRANI8-6-12-13610.jpgఅంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో సత్తా చాటిన సారా ఎరాని (ఇటలీ) కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఏడాదికి ముందు క్లే కోర్టుపై ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఈమె ఈ టోర్నీలో మాత్రం నిలకడగా అత్యున్నత స్థాయి ఆటతీరుతో అదరగొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి సెమీఫైనల్లో 21వ సీడ్ ఎరాని 7-5, 1-6, 6-3తో 2010 ఫైనలిస్ట్, ఆరోసీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించింది. గత మూడేళ్లలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన రెండో ఇటాలియన్‌గా రికార్డులకెక్కింది. 2010, 2011లో షియావోన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గతంలో ఐదుసార్లు స్టోసుర్‌తో తలపడిన ఎరాని ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 

మంచి ఆరంభంతో మ్యాచ్‌ను మొదలుపెట్టిన స్టోసుర్... ఎరాని సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే వెంటనే పుంజుకున్న ఇటలీ ప్లేయర్ 2-2తో స్కోరును సమం చేసింది. బలమైన సర్వీస్ చేయడంలో ఎరాని కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ 11వ గేమ్ వరకు ఇద్దరూ నిలకడగా ఆడారు. తర్వాత స్టోసుర్ టైమింగ్, నెట్టింగ్‌ను కోల్పోయింది. దీంతో ఇటలీ క్రీడాకారిణి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అయితే దీని నుంచి బయటపడేందుకు స్టోసుర్ రెండుసార్లు బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లను సంధించినా ప్రయోజనం లేకపోయింది. 

మూడో బ్రేక్ పాయింట్‌ను బ్యాక్‌హ్యాండ్ షాట్ ఆడి వృథా చేసుకుంది. తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న ఎరాని సెట్‌ను గెలుచుకుంది. రెండోసెట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్టోసుర్ బ్రేక్ పాయింట్‌తో తొలి గేమ్‌ను సాధించింది. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండోసెట్ ఏకపక్షంగా ఆసీస్ ప్లేయర్ సొంతమైంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లో స్టోసురు సర్వీస్ చేయడంలో విఫలమైంది. 

అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ఎరాని 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో పుంజుకున్న స్టోసుర్ రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని 3-3తో స్కోరును సమం చేసింది. కానీ డబుల్ ఫాల్ట్‌తో మరో తప్పిదం చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఎరాని మూడు మ్యాచ్ పాయింట్లను గెలుచుకుంది. మ్యాచ్ మొత్తంలో స్టోసుర్ 48 సార్లు అనవసర తప్పిదాలు చేసింది. 

నేటి సెమీఫైనల్స్
జొకోవిచ్ (1) - ఫెడరర్ (3), ఫై (6) - నాదల్ (2)

సాయంత్రం గం.5.30 నుంచి..

నియో స్పోర్ట్స్‌లో లైవ్
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్

 
sakshi news

  

coment on this