ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడు // సచిన్‌కు ‘విజ్డెన్’ అవార్డు

12/06/2012 18:58

 

ఏడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్

ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడు
రూ. 8 కోట్ల 73 లక్షల ప్రైజ్‌మనీ సొంతం 
జొకోవిచ్ చేజారిన ‘గ్రాండ్‌స్లామ్’

https://sakshi.com/newsimages/contentimages/12062012/NADAL-NEW12-6-12-48413.jpg


ఎర్రమట్టి కోటలో తానే రారాజునని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను ఏడు సార్లు గెల్చుకున్న ఆరో క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందాడు.

పారిస్: ఓ అద్భుతం నమోదైంది. ఊహించినట్టే నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. క్లే కోర్టులపై తన పట్టును ప్రపంచానికి చాటాడు. సోమవారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6-4, 6-3, 2-6, 7-5తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 

https://sakshi.com/newsimages/contentimages/12062012/SPORTS-1112-6-12-49225.jpg

ఈ విజయంతో ఇప్పటిదాకా ఆరు టైటిల్స్‌తో స్వీడన్ దిగ్గజం జాన్ బోర్గ్ పేరిట ఉన్న ఈ ఫ్రెంచ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదే సమయంలో తాజా విజయంతో వరుసగా నాలుగు ‘గ్రాండ్‌స్లామ్ టైటిల్స్’ గెలవాలని... ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేయాలని భావించిన జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. గత చివరి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో (2011 వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్) జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 12 లక్షల 50 వేల యూరోలు (రూ. 8 కోట్ల 73 లక్షలు)... రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 6 లక్షల 25 వేల యూరోలు (రూ. 4 కోట్ల 36 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ప్రస్తుతం నాదల్ ఖాతాలో 7 ఫ్రెంచ్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 యుఎస్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.

బ్రేక్ పాయింట్‌తో మొదలు...
https://sakshi.com/newsimages/contentimages/12062012/ok12-6-12-49585.jpg

వర్షంతో ఆదివారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి నాదల్ 6-4, 6-3, 2-6, 1-2తో ఉన్నాడు. సోమవారం ఫైనల్ మొదలైన వెంటనే జొకోవిచ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 2-2 వద్ద సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. నాదల్ 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ 12వ గేమ్‌లో సర్వీస్ చేశాడు. 

కీలకమైన బ్రేక్ పాయింట్ సాధించి మ్యాచ్‌ను ముగించాలనే లక్ష్యంతో కనిపించిన నాదల్ సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ జొకోవిచ్‌పై ఒత్తిడి పెంచాడు. మ్యాచ్‌లో నిలవాలంటే సర్వీస్ నిలబెట్టుకునే పరిస్థితిలో జొకోవిచ్ తడబడ్డాడు. 30-40తో వెనుకబడిన దశలో ఈ సెర్బియా స్టార్ ‘డబుల్ ఫాల్ట్’ చేసి తన సర్వీస్‌ను కోల్పోవడంతోపాటు మ్యాచ్‌నూ చేజార్చుకున్నాడు.

అత్యంత మధుర క్షణాలు‘‘ప్రపంచంలోనే ఫ్రెంచ్ ఓపెన్‌కు ఎంతోప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏడోసారి విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో ఇవి అత్యంత మధుర క్షణాలు.’’
- నాదల్

ఎనిమిదేళ్లలో ఒకే ఓటమి

ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ 2005లో అరంగేట్రం చేశాడు. బరిలోకి దిగిన తొలిసారే అతను
విజేతగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు టైటిల్‌ను సాధించాడు. 2009 ప్రిక్వార్టర్ ఫైనల్లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో నాదల్ అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే 2010, 2011, 2012లలో ఈ స్పెయిన్ స్టార్ మళ్లీ చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఫ్రెంచ్
ఓపెన్‌లో తన గెలుపోటముల రికార్డును 52-1కి పెంచుకున్నాడు.

 

 

 

 

సచిన్‌కు విజ్డెన్అవార్డు

దుబాయ్: https://sakshi.com/newsimages/contentimages/12062012/WISDEN12-6-12-56600.jpgఅంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్న భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘విజ్డెన్ ఇండియా అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. ఫిడెలిస్ వరల్డ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సచిన్ ఈ పురస్కారం స్వీకరించాడు. పుస్తకంలోని ఖాళీ పేజీలపై ఒక క్రికెట్ బంతిని ఉంచినట్లుగా తయారు చేసిన ప్రత్యేక క్రిస్టల్ ట్రోఫీని ఈ సందర్భంగా మాస్టర్‌కు అందజేశారు. ఈ ట్రోఫీకి ఒక వైపు టెస్టుల్లో సచిన్ చేసిన 51 సెంచరీలు, మరో వైపు 49 వన్డే సెంచరీల జాబితాను ముద్రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచిన్, చెన్నై (2008)లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీనే తన అత్యుత్తమమని పేర్కొన్నాడు.